NEW TRAVELOGUES

Tuesday, 29 November 2011

Ongole Seminar




Please see my travelogue published in Andhrajyothy on 27-11-2011

ట్రావెలోకం
మనసు 'కదిలె'

'కదిలె' ప్రాంతం ఎంత బావుంటుందో తెలుసా? ఒకసారి రాకూడదూ'' అని బంధువులు చెబితే ఆదిలాబాద్ జిల్లాలోని ఆ ఊరికి మొన్న దీపావళి సెలవుల్లో వెళ్లాం. హైదరాబాద్‌లో ఉదయం 9 గంటలకు బయలుదేరిన మేము 210 కి.మీ. ప్రయాణించి.. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్మల్ చేరుకున్నాం. అక్కడి నుంచి భైంసా రూటులో 12 కి.మీ. తిరిగి కుడివైపుకు మరో మూడు కిలోమీటర్లు వెళ్లగానే ఎత్తయిన సత్శల కొండలు ఎంతో అద్భుతంగా కనిపించాయి. కొండల మధ్యలో నుంచి వెళుతూ.. రెండు మూడు పల్లెలు దాటిన తరువాత ఒక లోయలో ప్రశాంతమైన ప్రకృతితో మమ్మల్ని స్వాగతించింది.. 'కదిలె'.

రెండు ఎత్తయిన పర్వత సానువుల మ«ధ్య జన్మించి.. జలజలా ప్రవహిస్తోంది ఒక సెలయేరు. ఇది పాపహరేశ్వరాలయం మీదుగా ఉత్తరం వైపు లోయమార్గంలోకి పరుగులిడుతోంది. ఈ సెలయేరుకు ఇరు వైపులా 50 మీటర్లకు పైగా ఎత్తున్న చెట్లున్నాయి. నీటి మధ్యలో కూడా పొడవాటి వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. ఆలయానికి ఈశాన్యంలో సెలయేరుకు అడ్డంగా కట్టిన డ్యామ్ పైనుంచి దుముకుతున్న నీరు జలపాతాన్ని తలపిస్తోంది. సెలయేరులో నడుచుకుంటూ ఒక ఫర్లాంగు దూరం వెళ్లగానే కుడివైపున ఒక ఆశ్రమం కనిపించింది. దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఆ ఆశ్రమ స్వామీజీ.
ఆశ్రమం ముందు పెద్ద వట వృక్షాలు, వాటి చుట్టూ విశాలమైన ఆవరణ ఉంది. ఆశ్రమం దాటి ఆ సెలయేరు ఇంకా ఎంత దూరం ప్రవహిస్తుందో తెలియదు.
మేము మాత్రం ఇంకొంచెం దూరం నడిచి చిన్నపిల్లలకు కాళ్లు నొస్తాయేమోనని వెనుదిరిగాం. ఆకాశాన్ని తాకే చెట్ల మధ్య, పక్షుల కేరింతల మధ్య, నీటి గలగలల మధ్య నడవడం ఒక మధురానుభూతి. ఆ దృశ్యాలన్నిటినీ కెమెరాల్లో బంధించాం.

కదిలే శివలింగం..
ఆలయానికి తూర్పు వైపున తప్ప మిగతా అన్ని వైపులా ద్వారాలున్నాయి. ఉత్తరం వైపున్న ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన శృంగి, భృంగి విగ్రహాలున్నాయి. వాటిని దాటి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు కోష్ట విగ్రహాలుగా బ్రహ్మ, గజానన, ఉమామహేశ్వరి, వరాహావతారం, విష్ణు విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయానికి ఆనుకుని ఈశాన్యంలో దక్షిణాభిముఖంగా అన్నపూర్ణ మాతా మందిరం ఉంది. ఆలయం ముందున్న నవరంగ మంటపంలో శిల్పకళతో అలరారే నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నంది చెవిలో మన చెవి పెట్టి వింటే 'ఓం నమః శివాయ' అని వినిపిస్తుందని పూజారి చెప్పారు.

నాకు మాత్రం అక్కడి సెలయేరు సవ్వడి, పక్షుల కువకువలు, చెట్లపై వీస్తున్న గాలి చప్పుడే లౌడ్‌స్పీకర్‌లో పెట్టి వినిపించినంత స్పష్టంగా వినిపించాయి. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది కదులుతుంది. భార్గవ రాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపిన తర్వాత పాపపరిహార నిమిత్తం దేశంలో 31 శివలింగాలను ప్రతిష్టించాక.. ఇక్కడికొచ్చి 32వ లింగాన్ని పెట్టాడట. అయితే ఈ శివలింగం కదలడంతో తనకు శివుడు ప్రసన్నుడైనాడని ఆయన భావించినట్లు చెబుతుంది స్థల పురాణం. వాస్తవంగా గుట్టల్లో నుండి ఉబికి వస్తున్న నీటిబుగ్గ చుట్టూ పానవట్టాన్ని బిగించి, సరిగ్గా ఆ బుగ్గపైనే శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో.. అది నీటి తాకిడికి కదులుతోంది. ప్రకృతి సౌందర్యానికి పవిత్రతను చేకూర్చేందుకే ఇలా చేశారనిపించింది.

ఆలయానికి దక్షిణంగా ఉన్న రెండు విశాలమైన గదుల్లో నిత్యాన్నదానం జరుగుతుంది. భోజనం తీసుకువచ్చామన్నా మమ్మల్ని కూడా తినమన్నారు ఆలయ నిర్వాహకులు. అక్కడ భక్తులు తమ ఇష్టసిద్ధి కోసం యాగాలు చేస్తున్నారు. ఆలయానికి ఈశాన్యంలో విశాలమైన, చదునైన ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆవరణలోనే ఏటా శ్రావణమాసంలో 30 రోజులపాటు జాతర, శివరాత్రి సందర్భంగా మరో 3 రోజుల జాతర నిర్వహిస్తున్నారు.

18 చెట్ల వటవృక్షం..
ఆలయానికి కొంతదూరంలో 18 రకాల చెట్లు ఒకే మహా వటవృక్షంలో పుట్టి పెనవేసుకొని పెరిగాయి. ఈ వటవృక్షంలో మద్ది, మేడి, జీడి, వేప, రావి, టేవు తదితర చెట్లుండటం విశేషం. దాని చుట్టూ ప్రదక్షిణ పథం ఉంది. అందులో ప్రదక్షిణలు చేస్తూ.. వటవృక్షానికి నిర్ణీత సంఖ్యలో నూలుదారం చుట్టి.. దీని మొదలు దగ్గర పూజలు చేసినవారికి సంతానయోగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వటవృక్షం దగ్గరికి ప్రతినెలా పౌర్ణమి, అమావాస్యల రాత్రి వెయ్యేళ్ల సర్పం వస్తుందని, దాన్ని చూసినవారు ఇక్కడ చాలా మందే ఉన్నారని చెపుతారు.

పాప హరిణి..
ఇక్కడున్న దేవుని పేరు పాపహరేశ్వరుడు. సామాన్యులు 'పాపన్న' అంటారు. భక్తుల పాపాలను హరించే దేవుడు కావడంతో ఆ పేరు వచ్చింది. ఈ దేవాలయమున్న కొండల పేరు సత్మల కొండలు లేదా నిర్మల కొండలు. సత్+మల అంటే 'మంచికొండలు' అని, నిర్మల అంటే స్వచ్ఛమైన కొండలు అని ఏదైనా అర్థం ఒకటే. ఈ ప్రదేశాన్ని దర్శించినవారికెవరికైనా ఇక్కడి కొండలు, లోయలు, చెట్లు, గాలులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, అవి మన ఆరోగ్యానందాలకు ఎంత ఉపకారం చేస్తాయో అనుభవంలోకి వస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పే బోర్డులు కనిపిస్తాయి. అంగ వస్త్రాన్ని తీసేశాకే భక్తుల్ని లోపలికి అనుమతిస్తారు.

లోయలో ఉన్న ఈ ఆలయానికి పశ్చిమాన ఎత్తయిన పర్వతాలున్నాయి. అటు వైపు నుంచి వచ్చే చెడు గాలులు, కాస్మిక్ శక్తులను ఆ కొండలు ఆపి భక్తులను రక్షిస్తాయి. ఈ ప్రక్రియను సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో... పశ్చిమం వైపు 'శని' ఉంటాడని, ఇక్కడి దేవుడు అతని బారి నుండి భక్తులను కాపాడతాడని చెప్తారు. దేశంలో దేవాలయాలన్నీ తూర్పుకు అభిముఖంగా ఉండగా, ఇదీ, కాశ్మీర్‌లో ఉన్న మరొక ఆలయం మాత్రమే పశ్చిమాభిముఖంగా ఉన్నాయని చెపుతారు.

సప్తర్షి గుండాల వెనుక..
ఆలయం వెనుక పారుతున్న సెలయేరులో ఏడు గుండాలు ఉన్నాయి. వీటిని సప్తర్షి గుండాలని, జీడి గుండాలని కూడా పిలుస్తారు. ఔషధ మూలికలను కలుపుకొని వస్తున్న నీరు జీడి రంగులో ఉండడం వలన ఆ పేరు వచ్చింది. మొదటి గుండం పేరు ఋషి గుండం. ఇది 18 చెట్ల మహావృక్షం కిందుగా వస్తున్న నీటిసారంతో ఏర్పడింది. ఈ నీటిలో కొన్ని దినాలు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని, సుఖరోగాలు నశిస్తాయని, ఈ నీటిని పంట పొలాలపై పిచికారీ చేస్తే చీడ పురుగులు నశించి దిగుబడి పెరుగుతుందని స్థానికుల విశ్వాసం. ఈ చెట్లన్నీ మన ప్రాచీనులు సంతాన సాఫల్యతకై చేసే ఆయుర్వేద చికిత్సలో మూలికలుగా వాడేవే కాబట్టి ఈ విశ్వాసం వెనుక శాస్త్రీయత కూడా ఉందేమో. ఉదాహరణకు, వేప కీటక నాశిని. మేడి చెట్టు ఇనుప ధాతువునిస్తుంది. ఈ రోజుకూ డాక్టర్లు గర్భిణులను ఎండిన మేడిపండ్లను (అంజీర్) తినమనడం, వాటి ధాతువులతో చేసిన ఐరన్ సప్లిమెంట్ మందు గుళికలు ఇవ్వడం గమనార్హం.

రెండవ గుండు పేరు సర్వ పాపనాశిని గుండం. ఆవు మూతిలో నుంచి వస్తున్న నీటితో ఒక మేడి చెట్టు కింద ఏర్పడింది ఈ గుండం. హిరణ్యకశ్యపుణ్ణి చంపిన అనంతరం నరసింహస్వామి చేతి గోళ్ల నుంచి రక్తం కారిపోతూనే ఉంటే లక్ష్మీదేవి మేడి ఆకుల రసం పోసి ఆ రక్తస్రావాన్ని ఆపిందని 'గురుచరిత్ర'లో ఉంటుంది. అలాంటి హీలింగ్ పవర్ ఉన్న చెట్ల నుంచి వస్తున్న నీటిలో స్నానం చేస్తే రోగాలు హీల్ (నయం) అవుతాయంటే నమ్మొచ్చేమో.

అత్తా కోడళ్ల గుండాలు..
మూడవ, నాల్గవ గుండాల పేర్లు శివార్చన గుండం, పాలగుండం. గర్భగుడిలో శివలింగానికి చేసిన అభిషేకపు నీటితో, పాలతో ఈ గుండాలేర్పడ్డాయని ఆ పేర్లు పెట్టారు. ఐదవ నీటి గుండానికి శివతీర్థ గుండమని పేరు. దీనికి ఉత్తరాన ఉన్న ఆరవ, ఏడవ గుండాలకు సూర్య చంద్ర గుండాలని పేరు పెట్టారు. సూర్య గుండంలోని నీరు వేడిగా, చంద్రగుండంలోని నీరు చల్లగా ఉంటుంది. అందుకే ఆ పేర్లు. ఈ రెండు గుండాలను స్థానికులు అత్తాకోడళ్ల గుండాలని కూడా అంటారు.

వాస్తు శిల్పాల చరిత్ర..
ప్రధాన ఆలయానికి కొంత దూరంలో మరో చిన్న ఆలయముంది. దాన్ని ధ్యాన మందిరం అని పిలుస్తున్నారు. ఆలయ గర్భగృహానికి ఇరువైపులా రెండేసి చిన్న గదులున్నాయి. ఆ గదులు ధ్యానం చేయడానికి ఉద్దేశించినవని చెపుతున్నారు. కాని సూర్యగుండం మెట్ల మీద, ప్రధానాలయం కోష్టాల్లో శివునితోపాటు బ్రహ్మ, విష్ణు, అన్నపూర్ణ -ఉమ, గణపతుల విగ్రహాలు ఉన్నాయని గుర్తు చేసుకుంటే, ఈ ఐదు దేవతల మతాలను పంచాయతనం అంటారు కాబట్టి ధ్యాన మందిరంగా పిలుస్తున్న ఆలయం మొదట పంచాయతన ఆలయమే అని చెప్పడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.

పైగా ఈ రెండు ఆలయాల శిఖరాలు, వాటికున్న ఎత్తయిన అరుగులు, స్తంభాలు చాళుక్యరీతిలో ఉన్నాయి కాబట్టి.. చాళుక్యులు పంచాయతన మతాలను పోషించారన్న వాదన సమర్థనీయంగానే కనిపిస్తోంది. చాళుక్యులు తెలంగాణను క్రీ.శ 560 నుంచి 753 వరకు ఒకసారి, క్రీ.శ.973 నుంచి 1160 వరకు మరోసారి పరిపాలించారు.
ఇక్కడి లింగం 32వదని, కర్నూలు జిల్లా యాగంటిలోని శివునితో సంబంధం కలదని స్థలపురాణం చెప్పడంలో ఓ ఆంతర్యం ఉంది. అదేమిటంటే- ఈ రెండు స్థలాల మధ్య చాళుక్యుల సామ్రాజ్యం విస్తరించడం.
ఇలా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన 'కదిలె' ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ తమ బాసర ఇక్కడికి 60 కిలోమీటర్లు. కుంటాల జలపాతం ఇక్కడికి 50 కిలోమీటర్లు. టూర్లలో భాగంగా చేర్చి ప్రచారం చేస్తే బాగుంటుంది.

- డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, ఫోన్ 9440687250

Monday, 7 November 2011

My Travelogue on Peddaiahgutta published in Andhrajyothy on 9-10-2011

ట్రావెలోకం
పెద్దయ్య గుట్టపై పాండవ క్షేత్రాలు

మన రాష్ట్రంలో చాలా అరుదుగా కనిపించే దేవుడు పెద్దయ్య. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మాత్రమే పూజింపబడుతున్నాడు. ఆయన ప్రధాన నెలవు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. పెద్దయ్య దేవుడి గురించి చాలాసార్లు విని అసలు సంగతేంటో తెలుసుకుందామని ఆగస్ట్ 14 ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌లో బస్సెక్కి కరీంనగర్, చొప్పదండి మీదుగా 230 కి.మీ. ప్రయాణించి లక్సెట్టిపేట చౌరస్తాలో 10 గంటలకు దిగాను. వెళ్లవలసిన చోటు దండకారణ్య ప్రాంతం కాబట్టి, అక్కడ పులులు, జిట్టకుర్రలు (చిరుతలు), ఎలుగుబంట్లు బెడద ఉంటుంది.

కాబట్టి నాతోపాటు మా బంధువులు అనిల్, లక్షీనారాయణలను తీసుకెళ్లాను. మమ్మల్ని ఆ చౌరస్తా నుండి దండెపెల్లికి (16 కి.మీ), అక్కడి నుండి పెద్దయ్య గుట్ట వరకు (8 కి.మీ) ఆటోలో తీసికెళ్లిన జగ్గారావు కూడా తన కొడుకుతో పాటు మాతో వచ్చాడు. పెద్దయ్య గుట్ట దండకారణ్యంలో భాగమైన సత్మాల కొండల్లో ఉంది. ఈ కొండలు గోదావరి నది ఎడమ ఒడ్డున తూర్పు పడమరలుగా ఉంటాయి. ఇక్కడి అడవుల్ని, జంతువుల్ని రక్షించడానికి ప్రభుత్వం 1985లోనే 893 చ.కి.మీ.ల వైశాల్యంలో కవ్వాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది.


జీడి వాగులో ట్రెక్కింగ్ పెద్దయ్యగుట్ట చూడ్డానికి ఒక నిటారు స్తంభంలా కనిపిస్తుంది. ఎత్తు సుమారు వేయి అడుగులుంటుంది. గుట్ట చుట్టూ అంతే ఎత్తైన కొండల వరుసలు వలయాకారంగా ముసురుకొని ఉండడంతో ... అవన్నీ దాటుకొని వెళ్లేంతవరకు పెద్దయ్యగుట్ట మనకు కనిపించదు. గుట్టకు ఈశాన్యంగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిగుండంలో పుట్టి ఒక సెలయేరు పారుతున్నది. ఆ నీళ్లు నిజంగానే జీడి రంగులో ఉన్నాయి. దోసిళ్లలోకి తీసుకోగానే స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి. తాగితే తియ్యగా ఉన్నాయి. వనమూలికలు కలిసిన నీరు కదా! ఈ సెలయేరు పచ్చని చెట్ల గుబుర్ల మధ్య ఒక కి.మీ. పొడవున పారుతూ తెల్లని దారిలా కనిపిస్త్తుంది.

ఆ సెలయేరు వెంటే, దాని గలగల శబ్దాలు వింటూ ఒక కి.మీ. దూరం ఉత్తరం వైపు నడిస్తే ఏరుకి ఇరువైపులా పొడవాటి చెట్లు మనకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. ఆ ప్రాంతంలో సీజనల్‌గా పుట్టే ఒక చెట్టు తీగతో చేసే మందు ఎంతటి తలనొప్పినైనా, తీవ్రమైన పార్శ్వపు నొప్పినైనా శాశ్వతంగా నివారిస్తుందట. అయితే ఈ తీగను గుర్తించి సేకరించడం అక్కడి స్థానిక గోండులు, నాయకపోడ్‌లకు మాత్రమే తెలుసట. ఆ తీగ దొరికే పరిసరాల్లోనే ఇంతకు పూర్వపు గోండు పూజారి సమాధి ఉంది. దాన్ని దాటగానే ఒక నీటి గుండం కనిపిస్తుంది. ఇక అక్కడి నుండి పవిత్ర స్థలం. పాదరక్షలు లేకుండానే ముందుకు సాగాలి. కొన్ని అడుగులు ఉత్తరం వైపు నడిచాక ప్రధాన గుండం వస్తుంది.

ప్రధాన గుండంలోకి పది అడుగుల ఎత్తు నుండి ఒక జలపాతం దుముకుతోంది. దాని కింద కేరింతలు కొడుతూ స్నానం చేయడం ఒక మధురమైన అనుభూతి. ఆ జలపాతపు నీరే అభిషేకానికి, వంటావార్పులన్నింటికి ఉపయోగిస్తారు. దాని కింది గుండం ఎంత ఎండాకాలం కూడా ఎండిపోదట. అక్కడి అటవీ జంతువులకు అదే ప్రధాన నీటి వనరు.

పెద్దయ్య ఇల్లారి
ప్రధాన గుండానికి పడమటి దిక్కున పెద్దయ్య దేవుని గుడి ఉంది. దీనిని స్థానికంగా ప్రజలు దేవుని ఇల్లారి అంటారు. అది గోడలు లేని గుడిసె. అందులో ఒక గద్దపై దక్షిణాభిముఖంగా ఏనుగులు, ఎద్దులు, గుర్రాలు, పులుల మట్టిబొమ్మలు అనేకం రెండు అంగుళాల ఎత్తునుండి రెండున్నర అడుగుల ఎత్తు వరకు ఎన్నో సైజుల్లో ఉన్నాయి. అవన్నీ ఎన్నో ఏండ్ల నుండి భక్తులు సమర్పించినవే. టెర్రాకోట బొమ్మలుగా పిలివబడే ఈ కాల్చిన మట్టిబొమ్మలు రెండున్నర వేల ఏళ్ల నాటివి. ఇక్కడికి సమీపంలోని కోటిలింగాల, రాయపట్నం, కర్ణిమావిడి తదితర గ్రామాల్లో అనేకం లభించాయి.

పరిసరాలు - చరిత్ర
పెద్దయ్య అంటే పాండవాగ్రజుడు ధర్మరాజు. అతని తమ్ముడు భీముడు గోండుల ఆడపడుచు హిడింబిని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రదేశం ఇప్పుడు 'పెండ్లి మడుగు'గా ప్రసిద్ధమై పెద్దయ్య గుట్టకు వెళ్లే దారిలో అడవి ప్రారంభమయ్యే చోట ఉంది. దానికి ఉత్తరాన ఫర్లాంగు దూరంలో 'భీముని ఇల్లారి' ఉంది. ఈ ఇల్లారికి పడమరన ఫర్లాంగు దూరంలో 'అర్జు గూడ' ఉంది. అర్జు గూడ అంటే భీముని తమ్ముడు అర్జునుని పేరున వెలిసిన గిరిజన గూడెం. జీడి గుండానికి పైన ఉత్తరాన కొంతదూరంలో కొండలపైన 'అర్జున లొద్ది' అనే నీటి గుండం కూడా ఉందట.

అర్జుగూడకు దక్షిణాన కి.మీ. దూరంలో సామ్‌గూడ ఉంది. నిజానికి అది 'సహ గూడ'. పాండవుల్లో ఒకడైన సహదేవుని పేర వెలసింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులపై గెలిచాక సహదేవుడు చేసిన దక్షిణ దిగ్విజయ యాత్రలో 'ఆంధ్రు'లను ఓడించాడని మహాభారతంలో ఉంది. ఇక్కడి గోండుల్లో 'అంధ్' అనే ఒక తెగ ఉంది. ఆనాటి యుద్ధ సమయంలో గోండు ప్రముఖులు తమ వద్ద ఉన్న బంగారాన్ని ఒక బావిలో పడేశారట. ఆ బావిని ఇప్పటికీ కాంచనబావి లేదా బంగారు బావి అని పిలుస్తారు. ఆ బావి అర్జుగూడకు దక్షిణాన ఫర్లాంగు దూరంలో ఉంది. ఆ బావి ఒడ్డున ఒక స్తంభం వింతగా ఊగుతోంది కాని విరగట్లేదు.

గుజరాత్‌లోని ద్వారకా నగరం ఇప్పుడు అరేబియా సముద్రంలో మునిగిపోయింది. మెరైన్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ ఎస్.ఆర్. రావ్ దాని శిథిలాలపై పరిశోధన చేసి భారతంలోని ఆధారాలతో పోల్చి శ్రీకృష్ణుడు క్రీ. పూ. 3102 ఫిబ్రవరి 17వ తేదీన చనిపోయాడని నిర్ధారించారు. దీన్ని నాసా, అమెరికా టైమ్ మిషన్ ధృవపర్చాయి కూడా. కాబట్టి అంతకంటే కొన్ని దశాబ్దాల ముందు పెద్దయ్య గుట్ట ప్రాంతంలో భీమ - హిడింబిల వివాహం, సహదేవుని దిగ్విజయ యాత్ర జరిగి ఉంటాయని అంచనా. పరిశోధనల ప్రకారం చూసినా ఇక్కడ సుమారు 5 వేల సంవత్సరాల పూర్వం నుంచి పాండవులు పూజింపబడుతున్నారన్నమాట. ఇక్కడ పాండవులను 'చిన్నయ్య పెద్దయ్య చిలుకల్ల భీమయ్య' అంటారు.

పెద్దయ్య ఇల్లారిలోని విగ్రహాల ముందు పసుపు, కుంకుమలు, రక్తపు మరకలు కనిపించాయి. దేవుడికి దండం పెట్టి పసుపు కుంకుమలు సమర్పించి గొర్రెలు, మేకలను కోస్తారట. దేవుడికిచ్చే ఆ జంతుబలి వల్ల తమ పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు భావిస్తారు. గోండు పూజారులు లేదా నాయకపోడ్ పూజారులు మంత్రించి ఇచ్చిన పసుపు కుంకుమలను తీసికెళ్లి తమ పంట పొలాలపై చల్లుకుంటారు. తద్వారా తమ పంటలకు కీటకాల బారి నుండి రక్షణ లభిస్తుందని నమ్మతారు.

గుట్టనెక్కేది పూజారే
పెద్దయ్య దేవుడి దగ్గర గతంలో గోండులు పూజారులుగా ఉండేవారట. ఇప్పుడు నాయకపోడ్‌లు పూజారులుగా ఉన్నారు. పూజారి మాత్రమే ఇక్కడి ఇల్లారిలోని దేవుడికి దండం పెట్టుకొని పూనకంతో నిట్టనిలువున్న పెద్దయ్య గుట్టను అవలీలగా ఎక్కుతాడు. అదీ పది నిమిషాల సమయంలోనే. ఎక్కుతున్నప్పుడు రెండు మూడు చోట్ల మాత్రమే మనకు కన్పిస్తాడు. ఇతరులెవరూ ఈ గుట్టను ఎక్కలేరు. గుట్ట ఎత్తును చూసేటప్పుడు రైతుల తలపాగలు (రుమాళ్లు), కళ్లద్దాలు తల వెనక్కి పడిపోతాయి.

పెద్దయ్య గుట్ట పైన దేవగణికలు ఉంటారట. అక్కడి నుండి పూజారి పసుపు కుంకుమలు, సీజన్‌లో పండే పంట గొలుకలను తీసుకొస్తాడు. గుట్ట దిగి ఇల్లారిలోకి వచ్చాక రైతులకు ఆ సీజన్‌లో ఏ రంగు గల ధాన్యం ఎక్కువ పండుతుందో, వర్షా ల స్థితి ఎలా ఉంటుందో, ఏ ఏ పంటలకు ఎలాంటి వ్యాధులు వస్తా యో తదితర విషయాల గురించి జోస్యం చెప్పి వారికి పొలాలపై చల్లుకోమని పసుపు కుంకాలను పంచిపెడతాడట.

అల్లుబండలు
పెద్దయ్య దేవుని ఇల్లారిలోని విగ్రహాల ముందున్న గద్దె పైన వాలీబాల్ సైజులో రెండు గుండ్రటి అల్లు బండలున్నాయి. మన మనసులో అనుకున్న పని అయ్యేటట్టయితే అవి లేవవట. కానట్లయితే లేస్తాయట. అటు ఇటుగా అయ్యేటట్లయితే అవి కూడా డోలాయమానం చెందుతాయి. ప్రయోగాత్మకంగా నేను మనసులో ఒక పని గూర్చి అనుకొని ఒక అల్లుబండను లేపితే మొదట అది లేవలేదు. కొంత ఎక్కువ బలం ప్రయోగించాక డోలాయమానం చెందింది. మరికొంత బలం ప్రయోగించాక మొత్తం లేచింది.

మొత్తమ్మీద నాకేమనిపించిందంటే, ఆ అల్లు బండలు వేల సంవత్సరాలుగా అబద్ధమాడని పూజారుల ఆధ్వర్యంలో ఉంటున్నాయి కనుక వాటికి సత్యశక్తి (మంత్రశక్తి) అయినా ఉండి ఉండాలి. లేదా అయస్కాంతపు బేస్‌మెంట్ (గద్దె)మీద పెట్టిన అయస్కాంతపు రాళ్లు అయినా అయ్యుండాలని. నమ్మితే దైవశక్తి, సూక్ష్మంగా పరిశీలిస్తే శాస్త్ర శక్తి. రెండూ గొప్ప విషయాలే. అనాగరిక గిరిజనులకు అంత శాస్త్ర శక్తి ఉందని అయినా నమ్మాలి.

పెద్దయ్య దేవుని దగ్గరికి పోతే తప్పకుండా పంటలు బాగా పండుతాయనే విశ్వాసంతో చుట్టపక్కల వందలాది గ్రామాల రైతులు ఆయిటి పూనేటప్పుడు (వర్షాకాలం ప్రారంభంలో), పునాసలప్పుడు (విత్తేటప్పుడు), పంట కోతలప్పుడు ఇక్కడికి తప్పకుండా వస్తారట. ఈ మధ్య ఎండాకాలంలో ఇక్కడికి చల్లదనం కోసం వచ్చే యాత్రికుల సంఖ్య కూడా ఎక్కువైంది. దేవుడి ఇల్లారి నుండి సుమారు కి.మీ. దూరంలో ఉండే గజ్జిబండ వరకు ఎక్కడా ఖాళీ స్థలం కన్పించనంత మేర వంటలు చేసుకొని తినిపోతారట. సహజమైన ఒక పెద్ద కొలోజియంను తలపించే ఈ ప్రాంతంలో పర్యాటకులు చేసే కేరింతల శబ్దాలు చుట్టూ ఉన్న గుట్టలకు తాకి వింతగా ప్రతిధ్వనిస్తాయి.
ప్రకృతి సౌందర్యానికి పరాకాష్ట అనదగిన పెద్దయ్య గుట్ట ప్రాంతంలో రైతులకు పరమాత్ముడు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం దీన్ని గుర్తించి అభివృద్ధిపరిస్తే లక్షల మంది పర్యాటకులు ఆనందిస్తారని హామీ ఇవ్వొచ్చు.

- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250